అమరావతి, మార్చి 30 : పేదలకు సాయం అందించేందుకు ఉగాది రోజున సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైలుపై తొలి సంతకం చేశారు. రూ.38 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో 3,456 మంది పేదలకు లబ్ధి కలుగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటివరకు 23,418 మంది పేదలకు రూ.281.38 కోట్లను ప్రభుత్వం అందించింది.

పాస్పోర్ట్ సేవలకు పెరిగిన డిమాండ్ దృష్టిలో ఉంచుకొని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏప్రిల్ 5న ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆ రోజుకు విజయవాడ సేవా కేంద్రంలో 800, తిరుపతి సేవా కేంద్రంలో 500 స్లాట్లను శనివారం విడుదల చేశారు. ఇప్పటికే ఉన్న దరఖాస్తుదారులు తమ అపాయింట్ మెంట్లు రీషెడ్యూల్ చేసుకోవచ్చని ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి శివహర్ష ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే కాకుండా ఏప్రిల్లో ప్రతి బుధవారం విజయవాడ సేవా కేంద్రంలో 750 అదనపు అపాయింట్మెంట్లతో రెగ్యులర్ డ్రైవ్ కొనసాగుతుందని పేర్కొన్నారు