#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం

రానున్న 30 రోజులు అత్యంత కీలక సమయ‌మ‌ని.. విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే పదో తరగతి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్దం చేయడంతో పాటు వివిధ స‌బ్జెక్టుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి నూరు శాతం ఫలితాలు సాధించేందుకు కృషిచేయాలని, అత్యవసరమైతే తప్ప శెల‌వులు పెట్టొద్ద‌ని.. జిల్లా కలెక్టర్‌ డా. జి లక్ష్మీశ ఉపాధ్యాయులను ఆదేశించారు.
మార్చి 17వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు నిర్వహించన్నున నేపథ్యంలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను స్వ‌యంగా పరిశీలించేందుకు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ ఇబ్రహీంపట్నం మూలపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. క‌లెక్ట‌ర్ ఆకస్మికంగా ఉదయం 8.55 నిమిషాలకు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వాహనం దిగి నేరుగా తరగతి గదులకు చేరుకున్నారు. అప్పటికే ఉపాధ్యాయురాలు పదవ తరగతి విద్యార్థులకు విద్యా బోధ‌న చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్థులతో జిల్లా కలెక్టర్‌ ముచ్చటిస్తూ విద్యార్థుల మేధా శక్తిని పరిశీలిస్తూ పలు ప్రశ్నలు వేశారు. డిజిటల్ బోర్డుపై గణితం, సోషల్‌ స్టడీస్‌కు సంబంధించి విద్యార్థులతో సమాధానాలు రాయించారు. ఏ విష‌యాన్ని చ‌దువుతున్నా 360 డిగ్రీ కోణంతో అధ్య‌య‌నం చేయాల‌ని.. అప్పుడే నేర్చుకున్న విష‌యాలు ఇప్ప‌టి ప‌రీక్ష‌ల‌కే కాకుండా జీవితాంతం ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని సూచించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుకునే ఎంద‌రో త‌మ మేధ‌స్సుతో, నిత్యం నేర్చుకోవాల‌నే త‌ప‌న‌తో ప్ర‌శ్నిస్తూ, నేర్చుకుంటూ ఉన్న‌త స్థానాల‌కు ఎదిగార‌ని.. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని క‌ష్ట‌ప‌డి, ఇష్ట‌ప‌డి చ‌దువుకోవాల‌ని సూచించారు