#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ప్రభుత్వం సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట

సంచార జాతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యుల ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను కలిసి రాష్ట్ర సంచార జాతుల అభివృద్ధి మండలి సభ్యులు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సంచార జాతుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికలు రచించారన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో వారికి ఉపాధి, నివాస భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. సీడ్ పథకం ద్వారా సంచార జాతులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణ ఇవ్వడంతో పాటు సబ్సిడీ రుణాలు అందించే ఆలోచన చేస్తున్నామన్నారు. సంచార జాతుల మహిళలతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. సంచార జాతుల వారు స్థిర నివాసం ఉండేలా నివాస గృహాలను నిర్మించి ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు. వారి పిల్లలకు విద్యా సదుపాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సంచార జాతుల్లో అక్షరాస్యత పెరిగితే తద్వారా వారు అన్ని రంగాల్లోనూ రాణించే అవకాశముందన్నారు