#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ధర్మాచరణ, ధర్మానికి అండగా ఉండేందుకే మాలధారణ

అయ్యప్పమాల వేసుకున్నది ధర్మాన్ని ఆచరించమని, ధర్మానికి అండగా ఉండటానికేనని చెప్పారు ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అయ్యప్ప మాల వేసుకున్న వారందరూ దీక్ష ముగిసిన తర్వాత కూడా పవిత్రయజ్ఞంగా మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి అందరూ సహకరించాలని కోరారు. వినుకొండ పాత శివాలయంలో మంగళవారం అయ్యప్ప, శివ, భవానీమాత మాలలు ధరించిన దీక్షాపరులకు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నప్రసాదం సదుపాయం కల్పించారు. సొంత ఖర్చులతో స్వాములకు సద్ధి(అన్నదానం) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి జీవీ ఆంజనేయులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు వేదాశీర్వచాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు అన్నవితరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ అయ్యప్ప, శివమాలధారులకు అన్నదానం దేవుని కృపగా భావిస్తున్నానని చెప్పారు. చాలా సంతోషంగా ఉందని, స్వాములంతా వచ్చి ప్రసాదం స్వీకరించినందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. మాలధారులకు భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలని, ఆ అయ్యప్పస్వామి, పరమేశ్వరుడు, భవానీమాత కోరుకున్న కోరికలను నెరవేర్చాలని, మీరంతా అనుకున్న పవిత్ర యజ్ఞాన్ని నెరవేర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా అయ్యప్ప మాలకు ఒక విశేషం ఉందని, అధర్మం నుంచి ధర్మం వైపు నడవాలని, చెడు నుంచి మంచివైపు నడవాలని, అందరినీ ప్రేమగా చూసుకోవాలని, అందరికీ ప్రేమ, సంతోషం పంచాలని, అందరూ సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషాన్ని పంచడమే దేవుడు మనికిచ్చిన జ్ఞానమని పేర్కొన్నారు. కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్న వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.