#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

నిర్మాణ‌మే కాదు… నిర్వ‌హ‌ణా ఆద‌ర్శంగా ఉండాలి

– డిసెంబ‌ర్ 10 వ‌ర‌కు హ‌మారా శౌచాల‌య్‌-హ‌మారా స‌మ్మాన్ ప్ర‌చార కార్య‌క్ర‌మం.

– ప్ర‌త్యేక స‌ర్వే ఆధారంగా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌.

– అన్ని గ్రామాల‌నూ ఓడీఎఫ్ ప్ల‌స్ ఆద‌ర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి.

– స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్.

బాపూజీ క‌ల‌లుగ‌న్న ప‌రిశుభ్ర భార‌తావ‌ని ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్‌ను ప్రారంభించింద‌ని.. ఈ కార్య‌క్ర‌మంతో ప‌దేళ్ల కాలంలో స్వ‌చ్ఛ‌త‌, ప‌రిశుభ్ర‌త‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయ‌ని.. మ‌రుగుదొడ్లు, క‌మ్యూనిటీ శానిట‌రీ కాంప్లెక్స్‌ల (సీఎస్‌సీ) నిర్మాణంతో పాటు నిర్వ‌హ‌ణ‌లోనూ ఆద‌ర్శంగా నిల‌వాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్ప‌ష్టం చేశారు.

ప్ర‌పంచ మ‌రుగుదొడ్ల దినోత్స‌వం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, పారిశుద్ధ్య శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన జిల్లా నీటి, పారిశుద్ధ్య మిష‌న్ (డీడ‌బ్ల్యూఎస్ఎం) స‌మావేశంతో పాటు ప్ర‌త్యేక కార్యక్ర‌మంలో స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎండీ బి.అనిల్ కుమార్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా త‌దిత‌రులు పాల్గొన్నారు. మ‌న మ‌రుగుదొడ్లు-మ‌న గౌర‌వం, మ‌రుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకోండి-ఆనందంగా జీవించండి అంటూ రూపొందించిన పోస్ట‌ర్లను ఆవిష్క‌రించ‌డంతో పాటు ప్ర‌తిజ్ఞ చేయించారు. స‌మాజానికి విశేష సేవ‌లందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల‌ను స‌త్క‌రించడంతో పాటు ల‌బ్ధిదారుల‌కు వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల మంజూరు ప‌త్రాల‌ను అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ పట్టాభిరామ్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా హ‌మారా శౌచాల‌య్‌:హ‌మారా స‌మ్మాన్ ఇతివృత్తంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.