ప్రాధాన్యత రంగాలను పటిష్టం చేయాలని: కడప కలెక్టర్.
ప్రాధాన్యతా రంగాల పటిష్టతతోనే… జిల్లా అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని.. ఆ దిశగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో.. అన్ని రకాల ప్రాధాన్యతా రంగాలకు చెందిన జిల్లా అధికారులతో.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా రంగాల్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు, పనుల పురోగతి, సాధించిన ప్రగతి.. తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సంబందిత అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ శాఖ పరిధిలో.. జిల్లాలో రబీ సాగుబడిని పెంచడంతో పాటు అధిక దిగుబడులను సాధించేలా యాజమాన్య పద్ధతులను రైతులు పాటించేలా అవగాహన పెంచాలన్నారు. ప్రతి రైతు పంటలకు ఈ-క్రాప్ బుకింగ్ తో పాటు.. ఈ-కేవైసి ప్రక్రియను పూర్తి చేయించాలన్నారు. ప్రతిఆ రైతు సేవా కేంద్రాల (ఆర్.ఎస్.కె.) ద్వారా.. వ్యవసాయ, ఉద్యాన రంగ సేవలను విస్తృతం చేయాలన్నారు. రబీ సీజన్ కు సరిపడా ఎరువులు, పురుగు మందులు కొరతలేకుండా నిల్వలు ఉంచాలన్నారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ శాఖలతో కలిపి.. సమ్మిళిత సాగుబడులను ప్రోత్సహించాలన్నారు. అలాగే సాయిల్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్స్ (ఎస్.డబ్ల్యు.పి.సి.) నిర్వహణను పెంచాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన సాగులో… సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించి ఆరోగ్యకరమైన దిగుబడులను పెంపొందించాలన్నారు. అరటి, బత్తాయి, మామిడి తోటల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఉద్యాన పంటల సాగుబడిని పెంపొందించేందుకు రైతుల్లో అవగాహన పెంచాయాలన్నారు. పశుసంవర్ధక శాఖను మరింత విస్తృతం చేస్తూ.. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, గొర్రెలు, మేకల పెంపకందార్లను ఆర్థికంగా ముందుకు నడిపించేందుకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. అనంతరం వివిధ పంటల్లో పురుగులు/ఎరువుల యాజమాన్యం పై వ్యవసాయ శాఖ ప్రచురించిన కరదీపికలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, ఇరిగేషన్ ఎస్ఈ వెంకట్రామయ్య, ఏపీఎంఐపీ పీడి వెంకటేశ్వర రెడ్డి, డిసిఓ సుభాషిణి, హార్టికల్చర్ డిడి సుభాషిణి, సిరి కల్చర్ ఎడి శ్రీనివాసులు, పశుసంవర్ధక శాఖ జెడి డా. శారదమ్మ, ఫిషరీస్, మార్కెటింగ్, పరిశ్రమలు వివిధ ప్రాధాన్యత రంగాలకు చెందిన జిల్లా అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.