ఫిబ్రవరి నాటికి 46 వేల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు
జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలో మంజూరైన 94,512 కుళాయి కనెక్షన్లు గానూ ఫిబ్రవరి 2025 నాటికి 46,316 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు అందించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య మిషన్ (జల్ జీవన్ మిషన్) సమావేశాన్ని కలెక్టర్ పి.అరుణ్ బాబు నిర్వహించారు. రానున్న ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కునేందుకు రూ.3.87 కోట్ల ప్రణాళికను ఆమోదించారు. ఈ మొత్తాన్ని బోరు బావుల పునరుద్ధరణ, పశువుల రక్షణ వంటి కార్యక్రమాలకు వినియోగించాలన్నారు. టాయిలెట్ ఫర్ డిగ్నిటీ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబరు 10 మానవహక్కుల దినోత్సవం వరకూ పరిశుభ్ర శౌచాలయాల ఆవశ్యకత తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో విశిష్ట సేవలు అందించిన నలుగురు క్లాప్ మిత్రలకు సన్మానం చేశారు. సమావేశంలో జిల్లా ఆర్డబ్లూఎస్ ఇంజినీర్ విజయకుమార్, జిల్లా భూగర్భ జల అధికారి శ్రీనివాస రావు, సీపీవో శ్రీనివాస్ మూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి మురళి, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వెంకట్ రెడ్డి, డీపీవో విజయ భాస్కర్ రెడ్డి, డీఆర్డీఎ పీడీ బాలు నాయక్, డీఎంహెచ్ఓ రవి తదితరులు పాల్గొన్నారు