#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
• హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించి, కాపాడేలా చర్యలు
• ఆలయాల పవిత్రత కాపాడేలా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు
• రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల విశిష్టత ప్రతి ఒక్కరికీ తెలిసేలా ప్రచార కార్యక్రమాలు
• పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
• టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి అధ్యక్షతన సమావేశం
• సమావేశంలో పాల్గొన్న దేవాదాయ ధర్మాదాయ, పర్యటక, ఆర్. అండ్ బి. శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు
రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ, ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం టూరిజం ద్వారానే అభివృద్ధి చెందాయని, రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. ఆలయాలు, పర్యావరణం, సాహస క్రీడలు తదితర అంశాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఏటా పది శాతం అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక రంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే పర్యాటక రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు